BHAGAVATA KADHA-3    Chapters   

మరుత్తుని యజ్ఞధనము : ధర్మజుని అశ్వమేధము

42

శ్లో || తదభిప్రేత మాలక్ష్య భ్రాతరోచ్యుత చోదితాః |

ధనం ప్రహీణమాజహు రుదీచ్యాం దిశి భూరిశః ||

తేన సంభృత సంభారో ధర్మపుత్రో యుధిష్ఠిరః |

వాజిమేధై స్త్రీభిర్భీతో యజ్ఞైః సమయజ ద్ధరిమ్‌||

---శ్రీభాగ 1 స్కం. 12అ.33,34 శ్లో.

"ధర్మనందనుండు బంధుసంహారదోషంబు వాయుకొఱకు నశ్వమేధయాగంబు సేయందలంచి ప్రజలవలనం గరదండంబుల నుపార్జితంబయిన విత్తంబు చాలక చిత్తంబునఁ జింతించునెడ నచ్యుతప్రేరితులై భీమార్జునాదులు తొల్లి మర్తుండను రాజు మఖంబును చేసి పరిత్యజించి నిక్షేపించిన సువర్ణ పాత్రాదికంబైన విత్తం బుత్తరదిగ్భాగంబు వలన బలవంతులై తెచ్చిన నా రాజసత్తముండు సమాయత్త యజ్ఞోపకరణుండై సకల బంధు సమేతంబుగఁ గృష్ణుని నాహ్వానంబుచేసి పురుషోత్తము నుద్దేశించి మూఁడుజన్నంబులు గావించెను".

---శ్రీమదాంధ్రభాగవతము

ఛ ప్ప య

కుంతీ నందన కహే - కృష్ణ ! కిహి విధి మఖహోవేఁ |

కౌన్‌ కాజ కరి కహో కాలిమా కుల కీ ధోవేఁ ?

ఛటే అంశ ఆరు దండ ద్రవ్య తేఁ కామ చలావేఁ |

భూమి పాల కీ జిహా వేదవిత వృత్తి బతావేఁ ||

హారి బోలే - 'హిమ శిఖరపై, ధన హై విపల మరుత్తకో |

లాఇ కరో మఖి జిహీ తో, సదుపయోగహై విత్తకో||'

అ ర్థ ము

కుంతీనందనుఁడగు ధర్మరాజిట్లనియె:- " కృష్ణా ! యజ్ఞ మేవిధముగ జరుగవలయును ? ఏ కార్యమును జరిపి కులనాశన దోషమును బాపికొందును ? ఆఱవభాగము దండద్రవ్యముగఁ గైకొనిన పని నెఱవేరునా? భూపాలునకు వేదవిహితమగు వృత్తి యేమియో చెప్పుము."

అనఁగా హరి యిట్లనెను:- "ధర్మజా! హిమశిఖరమున మరుత్తుని ధనము విపులనుగఁ గలదు. దానిని దెచ్చి యజ్ఞము కావించిన నా విత్తమునకు సదువయోగము కలుగును."

అసత్యముకంటె సత్యము శ్రేష్ఠమైనది. ఐశ్వర్యోపభోగము కంటెఁ ద్యాగము శ్రేష్ఠమైనది. విరోధముకంటె క్షమ శ్రేష్ఠము. అధర్మముకంటె ధర్మము శ్రేష్ఠము. తాను జేయు సమస్తకర్మలు శ్రీకృష్ణ పదారవిందముల కర్పించుటయుఁ, దన భారమంతయు నాతనిపై వేయుటయు సర్వ శ్రేష్ఠమైనది. దీనికి మించిన సర్వ శ్రేష్ఠమగు కార్యము లోకమున నింకొకటి లేదు. మహాభాగులగు పాండవు లిట్లే యొనర్చిరి.

యజ్ఞమునకు విపుల ద్రవ్యమవసరము. సాధారణ ద్రవ్యముతో నశ్వమేధయాగము వంటిది కాఁజాలదు. పాండవుల కడనంతటిద్రవ్యము లేదు. కోశమంతయు రణయజ్ఞమందు వ్యయమయ్యెను. శ్రీకృష్ణుఁడు హిమాలయమున గంధమాదన పర్వత శిఖరమందు గల మరుత్తుని యజ్ఞ శేషధనమును దెచ్చుట కాజ్ఞయీయఁగా ధర్మజుఁడు సమీపంబున గూర్చుండిన వేదవ్యాసుని గూర్చి యిట్లడిగెను:- " ప్రభూ! ఈ మరుత్తుఁడెవరు ? ఈతని కింతటి వైభవ మెట్లు కలిగినది ? ఈతని కింతటి విపుల ధనరాశి యెట్లు ప్రాప్తించినది ? ఆతఁడట్లు దాన నచ్చట యేల విడిచి పుచ్చెను ? మీరు నా యీ ప్రశ్నల కతి సంక్షేపముగఁ బ్రత్యుత్తర మిచ్చునెడల నా సోదరులను బంపి శ్రీకృష్ణునాజ్ఞచే నా ధనమును నా సోదరులచేఁ దెప్పించెదను."

ధర్మజుఁ డిట్లడుగఁగా వక్తలలో శ్రేష్ఠుఁడును, సత్యవతీ పరాశర నందనుఁడను వేదవ్యాసుఁ డిట్లు చెప్పఁ దొడఁగెను:- "రాజా! వినుము. పరమయశస్వియు, మహేంద్రైశ్వర్యము కలిగిన మరుత్తుని చరిత్రమును, ఆతని విపుల విత్తమును గూర్చి చెప్పెదను. నీవు నీ సోదరులతో సావధానపూర్వకముగ వినవలయును.

పూర్వకాలమునఁ బ్రతాపశాలియగు రాజు కరంధముఁ డనువాఁడు కలఁడు. నీకు ధౌమ్యుఁడు, కృపాచార్యుఁ డెట్లు పురోహితులుగా నుండిరో అట్లే యాతనికిని వేదవేత్తయు, సర్వశాస్త్రపారంగతుఁడునగు మహాముని పౌరోహితుఁడుగ నుండెను. అంగిరుఁడే ఆతనికి సమస్త దేవ, ఋషి పితృకార్యములు చేయించుచుండెను. అంగిరుని కిద్దరు పుత్రులు పెద్దవాఁడు, బృహస్పతి, రెండవవాఁడు సవర్తుఁడు. బృహస్పతిని దేవేంద్రుడు తన పురోహితునిఁగఁ జేసికొనెను. అన్నదమ్ములలో ఁ గొంచెముగ విరోధముండును. రాజా! అన్నదమ్ములలోను, బితాపుత్రులందును, మిత్రులకును సంబంధులలోను పరస్పరము విరోధము కలుగుచునేయుండును. దీనికి ముఖ్యమగు కారణము ఐశ్వర్యము, యశస్సు, ఇంద్రియ విషయములుగ నుండును. భోగలాలసచే నైశ్వర్యమదాంధుఁడై మానవుఁడు తన బంధువులను గూడ తిరస్కరించుచుండును. విప్రవరుఁడగు సంవర్తుఁడు శ్రేష్ఠుఁడగు తన సోదరునితో విరోధము బెంచుకొనఁదలఁపలేదు. ఆతఁడు తన సర్వస్వమును ద్యజించి విశ్వనాథపురియగు వారాణసికి వెళ్ళి దిగంబరవేషముతో భూతేశ్వరు నారాధించుచు, సందుగొందులలో నున్మత్తునివలెఁ జరించుచుండెను.

ఇప్పుడు అంగిరాము ద్రవ్యమునకు, ఆతని కుల పరంపరాగత యాజమాన్యమునకు ఉత్తరాధికారి బృహస్పతియయ్యెను. కరంధమ మహారాజు తర్వాత నాతని పుత్రుఁడు మరుత్తు సింహాసనాశీనుఁడయ్యెను. తన తండ్రి కరంధమున కెట్లు దెవర్షి పితృకార్యములు చేయించుచుండెడివాఁడో అట్లే బృహస్పతియు మరుత్తునకు దేవర్షి పితృకార్యములు చేయించుచుండెను. మరుత్త డతిబలవంతుఁడును, గుణవంతుఁడును, నైశ్వర్యవంతుఁడయ్యెను. ఆతని యైశ్వర్యమునుగాంచి దేవేంద్రుఁడు కూడ స్పర్థవహించెను. రాజా! ముక్తిమార్గమున కీ ఈర్ష్యారూప మగు దోషమే గొప్ప విఘ్నము. భూమిమీఁదనుండు జీవులు మొదలుకొని బ్రహ్మలోకజీవులవఱ కిదే దోషము కనఁబడుచున్నది. ఒకే వృత్తిలో నుండువారు వారిలో శ్రేష్ఠునిగాంచి ద్వేషించుచుందురు. ఇద్దరు విద్వాంసులు పరస్పరము వారి యశస్సునుగాంచి క్రుళ్ళుకొనుచుందురు. ధనవంతుఁడు, ధనవంతునిఁ జూచియు, స్వర్గములోని దేవతలు తమకంటె నధిక సుఖము చెందువారలను జూచి మండిపడిపోవుచుందురు. ఈ దోష కారణమున జీవుఁడు భగవత్పాదపద్మముల కడకుఁ జేరఁజాలడు. ఈ ఒక్కదోషము నశించెనా జీవుఁడు నిత్య, శుద్ధ, ముక్త పురుషుఁడు కాఁగలఁడు. దేవేంద్రుఁడుకూడ మరుత్తునుగాంచి యసూయ చెందుచుండెను. ఆతఁడిట్లు తలఁచెను :- " నేను స్వర్గమునకును, సమస్తదేవతలకును బ్రభువును. అయినను మర్త్యలోకాధిపతి యగు మరుత్తుని యైశ్వర్యము నాకు లేదు. వీని ధర్మకార్యముల కెట్లు విఘ్నము కలిగింతును ? లేకున్న నీతఁడు నాతో పోటీ చేయుటయే గాక, యింద్రపదమునుగూడ లాగుకొనఁగలఁడనుటలో నాశ్చర్య మేమియును లేదు.

ఇట్లాలోచించి యీర్ష్యావశమున నింద్రుఁడు తన గురువగు బృహస్పతిని బిలిపించి యిట్లనెను :- "దేవగూరూ ! మీరు మరుత్తునకు దేవర్షి పితృకార్యములను జేయించుట ఆపవలయును. ఇది నా కప్రతిష్ఠ. మీరు దివ్యులగు దేవతలకు గురువులరయ్యునొక మర్త్యునకు ధర్మకార్యములు చేయించుచున్నారు. మీరు దేవగురువులని పిలువఁబడుచును మనుష్యులకుఁ బురోహితుఁడవని పిలువఁబడుట అవమానముగ లేదా ? చూడుఁడు, నేను రెండుమాటలు చెప్పెదను. నేను బులిపుచ్చకపుమాటలు పలుకుట యెఱుఁగను. మీరు నాకు పురోహితులుగ నుండఁదలఁచునెడల మరుత్తునికార్యము లేవియును జేయింపరాదు. మీ కాతని పురోహితమే ప్రియమగునెడల నొక్క నమస్కారము. మీకు మాకు రామ్‌ రామ్‌ శ్యామ్‌ శ్యామ్‌. మీకీ రెండు పక్షములలో నేది యిష్టమో తెలుపుఁడు."

బృహస్పతి చాల చిక్కులోఁబడెను. ఆతఁడు రెండు వైపులను చిక్కేనని తలఁచెను. ఇంద్ర వాక్యములను విని యావిషయమునఁ జాల విచారించెను. చివరకు దేవ పురోహీతుఁడుగానే యుండి రాజపౌరోహిత్యమును వదలు కొనుటకే నిర్ణయించుకొనెను. ఇట్లు నిర్ణయించుకొని యాతఁడిట్లనెను :- " దేవేంద్రా ! నీకు మరుత్తునకు సాటియేమి కలదు? నీవు స్వర్గాధిపతివి, ఆతఁడు మరణశీలురగు మానవులకు రాజు. నీవజరుఁడవు, అమరుఁడవు, యజ్ఞభాగ భోక్తవు. మరుత్తుఁడా మరణధర్మము కలవాఁడు. వానికొఱకై నేను నిన్నెట్లు వీడఁగలుగుదును ? దేవేంద్రుని పూజ్యపురోహితుఁడు మరణశీలుఁడగు మరుత్తునకుఁ బురోహితుఁడై సుక్ర్సువములను బట్టి యజ్ఞమును జేయించుచున్నాఁడను నపకీర్తి నాకింతవరకు వచ్చినప్పటికిని, నేను శీలసంకోచము చేతను, కులపరంపరాగతమగు వృత్తియగుటచేతను నేనట్లు చేయించుచుంéటిని. ఇఁక నీవు వలదనిన నేనేల చేయించెదను ? ఇప్పుడు వారు వచ్చి నన్నడిగిన నిఁక నా పని నావలనఁ గాదని చెప్పివేసెదను."

ఇంద్రుఁడీ ప్రత్యుత్తరమును విని చాల సంతోషించెను.జీవులేల తమ ప్రతిస్పర్థి పరాభవమును గాంచి ప్రసన్నులగుదురో తెలియదు. మరుత్తుని యుత్తమయ్యైశ్వర్యమును భ్రష్టము కావించితినని యింద్రుఁ డనుకొనుచుండెను. ఏ విషయమైనను ఎన్నాళ్లో దాఁగదు. ఈ విషయమును మరుత్తు విని చాలదుఃఖిందెను. ఇది వఱ కెవరును జేయనంత సమృద్ధిశాలిగ యజ్ఞముజేయ నాతఁడు సంకల్పించి యాతఁడు తన కులగురువగు బృహస్పతి దగ్గఱకు వెళ్లి, యభిప్రాయమును దెలిపెను. రాజు వాక్యములను విని బృహస్పతి యిట్లనెను :- " రాజా ! నీకు మేలగుఁగాక ! నీవు నా వలన యజ్ఞాదుల నెఱవేర్చుకొను నాశను దలుకొనుము. నేను నీచేత నేవిధమగు పుణ్యకార్యమును జేయింపను. ఇఁక నీ పనులన్నియు నింకెవరిచేతనేనఁ జేయించుకొనుము. '

రాజు వినయముతో నిట్లనెను :- " స్వామీ !ల మీరిట్లు పలుకుచున్నారేల ? మఱియొక బ్రాహ్మణునిచే నే నెట్లు పౌరోహిత్యము చేయించుకొందును ? కుల పరంపరాగతుఁడగు తన పురోహితుఁడుండఁగా మఱియొకనిచేఁ జేయించుకొనిన గొప్ప పాపము సంభవింఁగలదు. అట్టి యెడ మిమ్ముల నే నెట్లు పరిత్యజింపఁగలుగుదును ?"

బృహస్పతి యిట్లనెను :- " నీవు నన్ను పరిత్యజించుట యెక్కడ ? నేనే నా బుద్ధిపూర్వకముగ నిన్ను పరిత్యజించుచున్నాను."

రాజు మిక్కిలి వినయముతో నిట్లనెను :- " ప్రభూ ! యజమానుఁడు చేసిన యే పాపమును గాంచి పురోహితుఁడు వానినిఁ బరిత్యజించుచున్నాఁడు ? నేనే పాపము చేసితినని మీరు పరిత్యజించుచున్నారు ? నాలో మీ రేపాపమును జూచితిరి ?"

బృహస్పతి సరళముగా నిట్లనెను :_ " రాజా ! నీవు పరమ ధర్మాత్ముఁడవు. నీలో నే పాపమును లేదు. నేను పాపకారణమున నిన్నుఁ బరిత్యజించుటలేదు. నీ వింకొక యోగ్యవేదజ్ఞుఁడగు బ్రాహ్మణునిచే యజ్ఞము చేయించుకొనవలసినదని నేను సంతోషపూర్వకముగ నాజ్ఞాపించుచున్నాను. నే నిది దోషముగ భావింపను. అప్రసన్నుఁడనుగాను."

రాజిట్లనెను :- " స్వామీ ! మీ రెట్లు వదలఁగలుగుదురు? వంశానుగతముగ మేము మీ పాదములను బూజించితిమి. దైవికముగ యజమానుఁడు ధనహీనుఁడగునెడల నైశ్వర్యశాలియగు యోగ్యపురోహితుఁడు వానిని వదలరాదు. లేక పురోహితుని వంశములోనివాఁడు విద్యావిహీనుఁ డగునెడల తెలివిగల యజమానుఁడు వానిని వదలరాదు. ఎట్లో యిద్దరును సరిపుచ్చుకొనవలసి యుండును. అదియునుగాక, నే నైశ్వర్యహీనుఁడను గాను. మిమ్ములను సర్వవిధముల సేవించుటకు సంసిద్ధుఁడను."

ఇది విని బృహస్పతి కొంచెము గద్దించుచు నిట్లనెను :- " రాజా ! ఉన్న విషయ మిది. నీ యిట్షమువచ్చినట్లు చేసికొనుము. నేను దేవేంద్రునకుఁ బురోహితుఁడనైతిని. ఇఁక నేనిప్పుడు మరణశీలురగు మానవులకుఁ బురోహితుఁడ నగుట యవమానముగఁ దలఁచుచున్నాను. కావున నాచో యజ్ఞము చేయించుకొను నాశను వదలుకొనుము."

ఇట్లు స్పష్టముగనన్న బృహస్పతి గర్వోక్తులను విని రాజున కపారదుఃఖము కలిగెను. ఆతనికన్నుల నీరు నిండెను గాని యింతలో నాతఁడు కొంచెముగ సంబాళించుకొని యిట్లనెను :- " దేవా ! ఇంద్రుని జేయువాఁడవు నీవే కదా ! ఇంద్రుఁడు వీఁడని నిశ్చితముగ లేఁడు. మీబోటి బ్రాహ్మణులు నూఱు యజ్ఞములను జేయించిరా వాని క్రిందాసనము లభింపఁగలదు. నేను మీకు పరంపరాగతుఁడ నగు యజమానుఁడను, సేవకుఁడను, మీ యాజ్ఞానువర్తిని. నాపై మీకు, మీపై నాకును అధికారము కలదు. నేనుమాత్రము వేనుకకు దగ్గను. మీరు నాచేత నూఱో రెండునూఱులో మీయిష్టమువచ్చినన్ని యజ్ఞములను జేయింపుఁడు."

బృహస్పతి యుత్తేజితుఁడై యిట్లనెను :_ " రాజా ! ఇన్ని మాట లవసరము లేదు. నే నిదివఱ కొక్కసారి చెప్పితిని. నీవు ఒకటి చెప్పుము. వేయి చెప్పుము. నేను యజ్ఞమును చేయింపఁజాలను, చేయింపఁజాలను, ముమ్మాటికిని చేయింపఁజాలను. నీవు నీపని చూచుకొనుము. నీ యిష్టమువచ్చిన వానిచే యజ్ఞము చేయించుకొనుము. నామీఁద ఆశను బూర్తిగ వదలుకొనుము".

ఇఁక మాటాడలేదు. ఆతఁడు దుఃఖితచిత్తముతో బృహస్పతికిఁ బ్రణామము కావించి వెళ్ళిపోయెను. నిరపరాధియగు తనను దన పురోహితుఁడు అకారణముగఁ బరిత్యజించినాఁడని యాతఁడు మనస్సులో జాల దుఃఖించెను. ఇంతలోనే యాతనికి "శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హేనాథ నారాయణ వాసుదేవ!" యను సుమధురనామసంకీర్తనము వినఁబడియెను. ఆతఁడు తలయెత్తి చూచునప్పటికి వీణవాయించుచు హరి గుణ గానము చేయుచు నారదమహర్షి కనఁబడెను. నారదుని గాంచి రాజు శ్రద్ధాభక్తులతో నాతని చరణముల కెరగెను. నారదుఁడు యథోచిత ఆశీర్వాదమొసంగిన తర్వాత నిట్లడిగెను :- " రాజా ! నీ వింత చింతతో నుంటివేల ? నీ దుఃఖకారమ మేమో నాకు కొంచెము చెప్పుము."

రాజు ఖిన్నమనస్కుఁడై యిట్లనెను :_ " స్వామీ ! ఏమి చెప్పుదును ? నేను పూర్వజన్మలోఁ జేసిన పాపఫల మేమియో కాని నా గురువు నిరపరాధియగు నన్ను బరిత్యజించినాఁడు " ఇట్లనుచు జరిగిన వృత్తాంతమంతయు మొదటినుండి చివరవఱకు చెప్పి యిట్లనెను :_ " స్వామీ ! నా కుల పురోహితుఁడు నన్ను ఁ బరిత్యజించిన నే నెవరిచే యజ్ఞము చేయించుకొనవలయునో మీరే చెప్పుఁడు."

సమస్త జీవకోటియొక్క కల్యాణ సౌభాగ్యములనే కోరు దేవర్షి నారదుఁడు రాజుతో నిట్లనెను :_ " రాజా ! నీవు భయపడ నేల ? నీ యజ్ఞమును నేను పూర్తిగావింపఁజేసెదను. అదియును మీ కులగురువు ద్వారానే."

కుమిలిపోవుచున్న రాజుమీఁద నమృతవర్షము వర్షించి నట్లుండెను. ఆత్యంతహర్షమున రాజిట్లడిగెను :_ " స్వామీ ! నా కుల గురువగు బృహస్పతి దేవేంద్రుని యైశ్వర్యమును గాంచి యైశ్వర్యమత్తుఁడై నాఁడు. ఆతనిద్వారా మీరెట్లు నా యజ్ఞమును బూర్తిజేయింపఁగలుగుదురు ?"

ఎవరైనఁ బరస్పరము పోట్లాడుకొనుచుండిన నారదున కానందము. అందుచేఁ నాతఁ డిట్లనెను :_ " రాజా ! న్యాయతః నీకు బృహస్పతి పురోహితుఁడు కాఁడు. నీ తండ్రికి పురోహితుఁడగు అంగిరామునికి ఇద్దరు పుత్రులు. పెద్దవాఁడు బృహస్పతి. రెండవవాఁడు సంవర్తుఁడు. యజమానులు పంచుకొనిన నీవంతునకు న్యాయతః సంవర్తుఁడు పురోహితుఁడు కాఁగలఁడు. నీ వాయనచేత నీ యజ్ఞమును జేయించుకొనుము."

రాజు దీనతతో నిట్లనెను :_ " బులిపుచ్చ కపు మాటలేల ? నాకు గురుపుత్రులిద్దరును సమానముగఁ బూజ్యులును, వందనీయులును. ఇద్దరును నాకు పురోహితులే. సంవర్తుఁడెచ్చటికో దిగంబరుఁడై వెడలిపోయినాఁడని వినియున్నాను. ఆయనను నే నెక్కడ వెదలి పట్టుకొనఁగలుగుదును? ఆతఁడు నాకు దొరికెనా నా మనోరతములన్నియు నెఱవేఱినట్లే."

రాజు వాక్యములు విని నారదుఁడిట్లనెను. :- "రాజా ! బ్రహ్మజ్ఞానియగు సంవర్తమహాముని జాడ నేను నీకు చెప్పఁ గలను. ఆతఁడు కాశీపట్టణమునఁ బిచ్చివానివలె దిగంబరుఁడై తిరుగుచుండును."

రాజిట్లనెను :_ " స్వామీ ! తన్ను దాను మఱుగుపరుచు కొనిన మహామునిని నే నెట్లు గుర్చింపఁగలను ?"

నారదుఁడిట్లనెను :_ " రాజా ! నేను నీకు ఉపాయము చెప్పెదను. నీ వొక శవమును గొనిపోయి వారాణసీ పురద్వారమున నుంచుము. నగ్నుఁడై యాపీనుఁగును జూడవచ్చిన యున్మత్తవేషధారియే అంగిరాపుత్రుఁడగు సంపర్తుఁడు. ఆతఁడు నిన్ను వెళ్ళగొట్ట బ్రయత్నించును. తానయోగ్యుఁడనని యనేక విధములఁ జెప్పును. కాని నీవా మోసమునఁ బడవలదు. ఆతఁడేది చెప్పిన నట్లు చేయుము. ఆతఁడు నా విషయ మడిగిన నేను అగ్ని ప్రవేశము చేసితినని చెప్పుము". ఇట్లు చెప్పి నారదుఁడటు నిటు తిరిగి క్షణములో నంతర్థానమయ్యెను.

మరుత్తునకు చాల సంతోషము కలిగెను. నారదుని ఆదేశానుసారముగ నాతఁడొక పీనుఁగును గొనిపోయి కాశీపురీ బహిర్ద్వారమునఁ బెట్టుకొని కూర్చుండెను. దైవికముగ నచ్చటకు ఉన్మత్తవేషధారి యగు సంవర్తుఁడేతెంచెను. శవమును గాంచి యాతఁడు తిరిగి పోవుచుండెను. ఆతఁడే బ్రహ్మజ్ఞానియుఁ బురోహితుఁడు నగు సంవర్తుఁడని యాతఁడు గ్రహించెను. అన్నిటిని వదలి యాతఁ డాతని వెంటఁబడెను. రాజు తనను వెంబడించు చున్నాఁడని తెలిసికొని సంవర్తుఁడు తన ఉన్మత్తతను బ్రకటించుచుండెను. రాజుమీఁద దుమ్ముచల్లెను. ఒండ్రుబురదను వివరెను. రాజుమీఁద నుమ్మివేసెను. ఇష్టమువచ్చినట్లు తిట్టమొదలిడెను. అయినను రాజాతనిని విడువలేదు.

అంత ముని గంగాతీరమున నొక యేకాంతస్థలమునఁ గూర్చుండెను. రాజు ప్రణామము కావించి చేతులు జోడించి యాతని కెదురుగా నిలుచుండెను. అంత సంవర్తమహాముని యిట్లడిగెను :- " రాజా ! నీకు నా జాడ యెవరు చెప్పిరి ?"

చేతులు జోడించి దీనతతో రాజిట్లనెను :- " స్వామీ ! నారదమహాముని మిమ్ములనుగూర్చి వృత్తాంతమును జెప్పి నాఁడు."

అంత ముని ప్రసన్నుఁడై యిట్లనెను ;- " నీకు నావలనఁ గావలసిన పనియేమి ? రాజు జరిగిన వృత్తాంతమంతయు నాద్యంతము చెప్పి యిట్లు ప్రార్థించెను :- " ప్రభూ ! మీరు నాచే యజ్ఞము చేయింపవలయును. నేను నా కులగురువుద్వారా యజ్ఞము చేయవలెనని కాంక్షించుచున్నాను."

సంవర్తుఁడత్యంతాశ్చర్యముద్రను వహించి యిట్లనెను :- " నీవు రాజువు . నాతోపాటుగా నీవుగూడ పిచ్చవాఁడవైతివా యేమి ? నే నున్మత్తుఁడను. ఎప్పుడేది తోఁచిన నట్లు చేయుచుందును. నాకు యజ్ఞములు చేయించుట యేమి తెలియును ? నీకీ తలతోఁక లేని మాటలు చెప్పినదెవరు ? నాకు యజ్ఞముచేయించు యోగ్యత కలదని నీకెట్లు విశ్వాసము కలిగినది ?"

చేతులు జోడించి దీనతతో రా జిట్లనెను :- " ప్రభూ ! మీరు సమస్తమునుఁ జేయఁగలుగుదురు. యజ్ఞము చేయించుటేమి ? నూతనసృష్టియే చేయగల్గుదురు. నేను మీ మోసములో ఁబడను. నాకు నారదుఁడు సర్వము చెప్పినాఁడు. ఏమైనఁ గానిండు. మీరు నా యజ్ఞమును జేయించితీరవలయును."

ఇంకేమున్నది ? ముని మనస్సు కఱగెను. ఆతఁడు ప్రసన్నుఁడై యిట్లనెను :- " రాజా ! నేను నీ యజ్ఞము చేయించెదను. అట్టి యజ్ఞము నిదివఱకు గొప్ప గొప్ప రాజులే కాదు, దేవేంద్రుఁడుకూడ చేయలేదు. కాని నీవొక ప్రతిజ్ఞ చేయవలయును. నీ యజ్ఞమును జేయింప మొదలుపెట్టఁగానే ఇంద్ర బృహస్పతు లిద్దరును మన యిద్దరిమధ్య భేదభావము పుట్టింపఁ బ్రయత్నించెదరు. వారి ప్రలోభనమందు పడక నన్ను పరిత్యజింపకుండిన నీ యజ్ఞమును జేయించెదను."

రాజత్యంత వినయముతో దృఢముగా నిట్లనెను :- " స్వామీ ! నే నీ విశ్వనాథపురియగు కాశీయందు గంగాభగవతీ సాక్షిగా అశ్వత్థముక్రింద నిలుచుండి చెప్పుచున్నాను. సాక్షాత్తుగా పితామహుఁడగు బ్రహ్మవచ్చి చెప్పినను మిమ్ములను బరిత్యాగము కావింపను."

ఇది విని సంవర్త మహాముని మిక్కిలి ప్రసన్నుఁడై యిట్లనెను ;- " రాజా ! నీవు చేసిన ప్రతిజ్ఞను జ్ఞాపకముంచుకొనుము. నా యన్నయగు బృహస్పతి మోసపు మాటలను విని నన్ను వదలినయెడల నాతఁడు నాకంటెఁబెద్దవాఁడగుటచే నాతనినేనేమియు ననఁజాలను; కాని నీకు సర్వనాశనము కావింతును. నీ ప్రతిజ్ఞ ను నీవు వదలక నిలువఁబడి నా వశమందుంటివా నీ కోశము నక్షయము కావింతును. నిన్ను ఁ గాంచి యింద్రుఁడు కూడ లజ్జితుఁడు కాఁగలఁడు. రాజా ! నీకు మేలగుగాక! ఇప్పుడు నీవు తపస్సు చేసి శివుని ఁ బ్రసన్నునిఁగావింపుకొనుము. ఆతఁడు ప్రసన్నుఁడై గుహ్యక, చారణ, గంధర్వులచే రక్షింపఁ బడుచున్న సువర్ణరాశి నీ కీయఁగలఁడు. దానితో నేను నీ యజ్ఞమును జేయించెదను."

సంవర్తమహామునియాజ్ఞను బొంది రాజు తన తపస్సుచే శివుని ఁ బ్రసన్నుని గావించి యక్షయ సువర్ణరాశిని బొందెను. సంవర్తమహాముని దానిచే యజ్ఞసామగ్రి నంతయు సిద్ధము చేసెను. ఆతఁడిట్లాజ్ఞాపించెను :- మా యజ్ఞములోఁ బాత్ర ములు, స్తంభములు, భవనములు, వేదులు సకలవస్తువులు సువర్ణమయములే కావలయును. ఇతరధాతువులతోఁ జేయఁబడిన దే కార్యమునకు నుపయోగింపరాదు.

సంవర్తునిద్వారా చేయింపఁబడుచుండిన మరుత్తుని యజ్ఞసమాచారమును వినఁగానే యింద్రునకు తహతహ పుట్టెను. తన గురువగు బృహస్పతి యంగీకారముచే నగ్నిని బంపియు, గంధర్వులను బంపియు రాజునకు, సంవర్తునకు విరోధము కలిగింప వలెనని చాల ప్రయత్నించెను. ఆతని యజ్ఞమును బృహస్పతియే చేయించునని మాటిమాటికి కబురుచేయుచుండెను. కాని రాజు చలింపలేదు. ఆతఁడింద్ర బృహస్పతుల మాటలను లక్ష్యపెట్టనే లేదు. చివరకు దేవేంద్రుఁడు యజ్ఞమునకు విఘ్న మాపాదించుటకై స్వయముగ వజ్రము కొనివచ్చెను. అప్పుడు రాజు విచలితుఁడు కాఁజొచ్చెను. అంత సవంర్తుఁ డాతని నోదార్చుచుఁ నిట్లనెనను ;- " రాజా ! నీవు భయపడవలదు. నేను నా మంత్ర బలముచే నింద్రుని స్తంభితునిఁ గావించెదను. " మహాముని వాక్యములను విని రాజిట్లనెను :- " స్వామీ ! ఇంద్రుఁడు క్రుద్ధుఁడై యజ్ఞభాగమును గొన రాకుండినఁ జేసిన దంతయు వ్యర్థమే కదా !".

ధృఢముగ సంవర్తుఁడిట్లనెను :- " రాజా !నీవు చాల తెలివి తక్కువగ మాటలాడుచున్నావు. నీకు నా శక్తియందు విశ్వాసము లేదు. నేను పిలిచిన రాకుండునంతటి శక్తి యింద్రుని దగ్గఱ ఎక్కడిది ? నేను నా మంత్రబలముచే నింద్రుని బలవంతముగ లాగుకొని వచ్చెదను." శక్తి సంపన్నుఁడగు సంవర్తుని సాహసము ముందు దేవేంద్రుఁడు తల యొగ్గవలసి వచ్చెను. ఆతఁడు ప్రసన్నుఁడై రాజు యజ్ఞమునకు వచ్చి యానందముతో సోమరసపానము గావించెను. సంతుష్టుడై రాజుతో నిట్లనెను :- " రాజా ! నేను నీకేమి ప్రియము కావింతును ?".

రాజిట్లనెను :- " స్వర్గాధిపా ! నీవు నాయెడలఁ బ్రసన్నుఁడ వగునెడల నా యజ్ఞమును విధిపూర్వకముగ సమస్త దివ్వైశ్వర్యములతో నెఱవేర్పుము."

ఇంద్రుఁడిట్లనెను :- "తథాస్తు" అని యాతఁడు విశ్వకర్మచే నచ్చట సహస్రాధికములుగ స్వర్ణమందిరములను, భవసములను గట్టింపఁజేసెను. మరుత్తు అడిగినవారి కడిగినట్లుగ నొసంగెను. బ్రాహ్మణులకు వారెత్తఁజాల నంతగ బంగారము నొసంగెను. వారు చాల భాగ మచ్చటనే వదలి వెళ్లిపోయిరి. యజ్ఞమొనర్చిన తర్వాత యజ్ఞ సామగ్రుల నన్నిటిని అచ్చటనే వదలి పెట్టి పోయెను. అవి యిప్పటివఱకును గుహ్యక రాక్షస గంధర్వాదుల ద్వారా రక్షింపఁబడుచుండెను. వానిలో నీకు కావలసినవి శ్రీకృష్ణానుమతినిఁ దెప్పించుకొని నీయజ్ఞములను బూర్తికావించుకొనుము. మొట్ట మొదట శివునిఁ బూజించి ప్రసన్నునిఁ గావించుకొనవలయును; లేకున్న దానిలో నొక కణమైన నెత్తవీలుగాదు."

భగవదాజ్ఞను, వ్యాసానుమతిని గ్రహించి ధర్మరాజు తనసోదరులను బంపెను. వారు శివునిఁ బూజించి, ప్రసన్నుని గావించుకొని యాసువర్ణమును వేలకొలఁది బండ్లమీఁదను, లక్షలకొలఁది యొంటెల మీఁదను, గుఱ్ఱముల మీఁదను, నేనుఁగులమీఁదను, కంచరగాడిదల మీఁదను వేసికొని తెచ్చిరి.

ఆ విపుల ధనరాశిని గొని పాండవుల హస్తినాపురమునకు వచ్చునప్పటికి అందఱకుఁ బరమాశ్చర్యమయ్యెను. గంగా తీరమున ననేక యోజనముల విస్తీర్ణముకల స్థలము సమముగ నొనర్పఁబడి యజ్ఞము చేయఁబడుచుండెను. బ్రాహ్మణ లిట్లు సలహా నొసంగిరి:- " మహారాజా ! ఒక యజ్ఞములోనే సమస్త విధులు త్రిగుణీకృతము కావింపుము. మూఁడు రెట్లు దక్షిణ లిమ్ము. నీకు మూఁడు యజ్ఞములు చేసిన ఫల మొక్కసారే లభింపఁగలదు." ధర్మరాజట్లే కావించెను. యజ్ఞాశ్వము విడువఁబడెను. అంత యజ్ఞవిధులన్నియు నెఱవేర్చఁబడెను. యజ్ఞ పతియే స్వయముగ యజ్ఞము కావించుచుండఁగా దాని సఫలత విషయములో ఁ జెప్పవలసిన దేమున్నది ?

ధర్మరాజా యజ్ఞములో నంతులేని ధనమును గొని వచ్చెను. దానిని అడిగినవారికి అడిగినట్లు నిచ్చివేసెను. ఏవేళ నైనను ఇష్టము వచ్చినట్లు కోరినవారు కోరినట్లుగఁ దినవచ్చును. త్రాగువారు త్రాగవచ్చును. ఏవస్తు వెవఁడు కావలెననిన నా వస్తువు వాఁడు తీసుకొనవచ్చును. దాని కడ్డులేదు. ఈవిధముగ యుధిష్ఠిరుని యజ్ఞము మరుత్తుని యజ్ఞముకంటె మిక్కిలి వైభవముగ జరిగెను. మరుత్తుని యజ్ఞములో నింద్రుఁడు యజ్ఞము చేయింపవచ్చెను. ఈ యజ్ఞములో ఇతని తండ్రికిఁగూడ పితామహుఁడగు శ్యామసుందరకృష్ణుఁడు యజ్ఞము చేయించు పెద్దయయ్యెను. ఆ కారణమున నాయజ్ఞము అనుపమేయ మయ్యెను.

ఈవిధముగ యుధిష్ఠిరుని యశ్వమేధయాగములను సాంగోసాంగముగఁ బూర్తికావించి, యందఱను సంతోషపెట్టుటకై కొంతకాలము శ్రీకృష్ణుఁడు హస్తినాపురములో నుండెను. అంత నందఱకడ ననుజ్ఞగొని ప్రత్యేకముగా నందఱను గలిసికొని యాదవులతోడను, తన పిరియసఖుఁడగునర్జునునితోడను శ్రీకృష్ణుఁడు యాదవులద్వారా ప్రతిపాలితమగు ద్వారకాపురికిఁ జనెను.

ఛ ప్ప య

అచ్యుత ఆజ్ఞా సా ఇ హిమాలయ పాండవధాయే |

శివకూఁకరి సంతుష్ట మరుత మఖ కో ధన లాయే ||

కరి కృష్ణార్పణ సభీ యజ్ఞ కే కారజ కీన్హే ఁ |

అన్న, వస్త్ర, ధనధామ, గ్రామ విప్రని కూఁ దీన్హే ||

ఇంద్ర సరిస కుంతీ తనయ, నవ జలధర సమ శ్యామహైఁ |

స్వర్ణ వారి వరసౌఁ విపుల, పూరేఁ సబకే కామ హైఁ ||

అర్థము.

భగవదాజ్ఞచే పాండవులు హిమాలయమునకుఁ బరువిడి, తపస్సుచే శివుని సంతుష్టిపఱచి మరుత్తుని ధనములో మిగిలిన దానినిఁ గొనివచ్చిరి. అందఱును గృష్ణార్పణముగ యజ్ఞ కార్యములను జేయుచుండిరి. బ్రాహ్మణులకు అన్న, వస్త్ర, ధన, గేహ, గ్రామాదుల నిచ్చిరి.

కుంతీ తనయుఁడగు ధర్మరాజు ఇంద్రునివలె నుండెను. శ్యామసుందరుఁడగు కృష్ణుఁడు నవనీలమేఘమువలె నుండెను. (ఇచ్చట ధర్మరాజును ఇంద్రధనస్సునకును, కృష్ణుని మేఘమునకును బోల్చినారు) ఇట్టి మేఘమునుండి బంగారు వర్షము అంతేకుండ కురిసి, సమస్త యాచక కోర్కెలను బండించెను.

-----

BHAGAVATA KADHA-3    Chapters